ఆయిల్‌పాం సాగు అంతంతే..!
ఈ నెలాఖరులోపు లక్ష్యాన్ని నెరవేరుస్తాం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్‌పాం సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఆయిల్‌పాం సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. 2025–26లో ఆయిల్‌పాం పంట సాగు చేయాల్సిన లక్ష్యంలో ఇప్పటి వరకు సగం లక్ష్యం సైతం పంట సాగు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఆయిల్‌పాం సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించకపోవడం కూ ఛ్ఛి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆయిల్‌పాం సాగుచేసే రైతులకు నాలుగేళ్ల తర్వాతే దిగుబడులు ప్రారంభమవుతాయి. జిల్లాలో ఎక్కువగా వరిపంటతో పాటు ఇతర ఆరుతడి పంటలను సాగుచేసి సీజన్ల వారీగా వచ్చే దిగుబడులకు అలవాటుపడిన రైతులు ఇప్పుడు ఆయిల్‌పాం సాగు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలో ఈ యేడాది 2,500 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేయాల్సి ఉండగా 1,300 ఎకరాల్లో పంటసాగుకు అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు పొందారు. ఇప్పటి వరకు జిల్లాలో 711ఎకరాల్లో మాత్రమే ఆయిల్‌పాం పంటను రైతులు సాగు చేశారు. గడిచిన నాలుగేళ్లల్లో జిల్లాలో 2,700 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేశారు. కాగా సుదీర్ఘకాలం పాటు వచ్చే లాభాలతోపాటు ప్రభుత్వం అందించే రాయితీలపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే జిల్లాలో ఆయిల్‌పాం సాగు లక్ష్యం నెరవేరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
కాగా జిల్లాలోని ఉద్యాన శాఖలో తలెత్తిన సిబ్బంది కొరత వల్ల వివిధ రకాల ఉద్యాన పంటల సాగు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో మొత్తం ఏడుగురు ఉద్యానశాఖ అధికారులు(హెచ్‌వో) ఉండాల్సిండగా ప్రస్తుతం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, జుక్కల్ నియోజకవర్గాలలో ఉద్యాన శాఖ అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంది. దీంతోపాటు నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద ఉద్యానక్షేత్రానికి ఒక హెచ్‌వో, జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో ఇద్దరు హెచ్‌వోలు విధులు నిర్వహించాల్సి ఉంది. కాని ప్రస్తుతం జిల్లాలో నలుగురు హెచ్‌వోలు మాత్రమే ఉండడంతో వారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిపై అదనపు భారం పడి జిల్లాలో ఉద్యానపంటలసాగు లక్ష్యం వెనకపడుతోంది.
జిల్లాలో ఈ యేడాది 2,500 ఎకరాల్లో ఆయిల్‌పాం పంట సాగవుతుందని అంచనా వేసుకున్నాం. జిల్లాలో 1,300 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేయించేందుకు ఇదివరకే కలెక్టర్ నుంచి అనుమతులు పొందాం. అందులో ఇప్పటికే 711 ఎకరాల్లో పంట సాగు పూర్తయింది. మిగిలిన లక్ష్యాన్ని ఈ నెలాఖరులోపు నెరవేరుస్తాం.
– జ్యోతి, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి, కామారెడ్డి
ఈ ఏడాది జిల్లాలో 2,500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం
1,300 ఎకరాల్లో సాగుకు
కలెక్టర్ అనుమతులు
ఇప్పటివరకు 711 ఎకరాల్లో సాగు పూర్తి


