నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
బాన్సువాడ రూరల్/బిచ్కుంద: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే సిబ్బంది వివాదాలకు అవకాశం ఇవ్వకుండా, నిష్పక్షపాతంగా పనిచేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. మంగళవారం ఆమె బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో, బిచ్కుందలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లను పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పలుసూచనలు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరు గుర్తింపుపై నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల కేంద్రాల్లో ఏ పొరపాటు జరిగినా రిటర్నింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు సామగ్రి సకాలంలో, సురక్షితంగా చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు.


