చోరీ కేసులో దంపతుల అరెస్టు
● సీసీటీవీ ఫుటేజీతో కేసును ఛేదించిన పోలీసులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): చోరీ కేసులో దంపతులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. ఈ నెల 7న మండలంలోని పద్మాజివాడి చౌరస్తాకు చెందిన యాళ్ల సురేశ్ రెడ్డి ఇంట్లోకు చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు మూడు పట్టగొలుసుల జతలు, రూ.15 వేల నగదు, రెండు గ్రాముల బంగారు దుద్దులు అపహరించారు. కేసు నమోదు చేసిన అనంతరం సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్ ఘటనా స్థలాన్ని సందర్శించి సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. బాలె నర్సింలు అలియాస్ చింటూ(చిన్నా), బొల్లిపల్లి రేణుకా అలియాస్ మైలారం రేణుక కలిసి ఆటోను నేర సాధనంగా ఉపయోగించి చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను మర్కల్ మల్లన్నగుట్ట వద్ద పట్టుకొని వారి నుంచి ఆటో, మొబైల్, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్, కానిస్టేబుల్ రవి, అజర్ ఫారూక్, అబ్దుల్ హమీద్, శశికాంత్, స్వర్ణలత, నరేశ్, శ్రీకాంత్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.


