మంచి పాలన అందిస్తున్నాం..
● మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్: క్రికెట్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్‌తోపాటు మంత్రిగా ప్రజలకు మంచి పాలన అందిస్తానని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ల పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి బస్టాండ్, మినీ ట్యాంక్‌బండ్, అర్బన్ పార్క్, ఏటీసీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఎల్లారెడ్డినిలో ఈద్గా ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి సరైన అభివృద్ధిని చూడలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా రూ.35 కోట్లతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతోందన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, కాంగ్రెస్ అభ్యర్థులు పద్మ శ్రీకాంత్, మత్తమాల భాగ్యవతి, గాయత్రి, మహేశ్వరీ, కౌసరున్నీసా, మంజుల, చంద్రయ్య, గఫార్, నునుగొండ శ్రీనివాస్, గాదె తిరుపతి, స్వప్న, ఎరుకల దశరథం తదితరులు పాల్గొన్నారు.


