త్వరలో బాన్సువాడ మీదుగా రైల్వేలైను
మాజీ ఎంపీ బీబీ పాటిల్
బాన్సువాడ: బోధన్–బీదర్ రైల్వేలైనుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో బాన్సువాడ మీదుగా రైల్వేలైను పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం బాన్సువాడలో బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టాణాలు అభివృద్ధి చెందాలంటే రైల్వేలైను ఉండాలని, బోధన్–బీదర్‌కు రైల్వేలెను కోసం గతంలో ప్రతిపాదనలు పంపితే మోదీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, సాంకేతిక సమస్యల వల్ల పనులు ప్రారంభం కాలేదని, త్వరగా పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సంగారెడ్డి–అకోలా జాతీయ రహదారి విస్తరణ వల్ల హైదరాబాద్‌కు వెళ్లే బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజలకు దూరం తగ్గిందని, ట్రాఫిక్ లేకుండా సులువుగా హైదరాబాద్ వెళ్లి వస్తున్నారని అన్నారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలో 17 మంది అభ్యర్థులు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారని, కమలం గుర్తుకు ఓటేసి వారందరిని గెలిపించాలని కోరారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు: యెండల
ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ.. బాన్సువాడను బషీర్‌బాగ్‌గా మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ఎన్‌జీవోఎస్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, వాసవికాలనీ, గౌలీగూడల పేర్లు మారుస్తున్నారని ఆరోపించారు. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి జైలుకు వెళ్లి వస్తుంటే గుర్రంపై పువ్వులు చల్లుతూ స్వాగతం పలికడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. యూపీ సీఎం యోగి తరహాలో బాన్సువాడలో కూడా బుల్డోజర్ యాక్షన్ చేయక తప్పడం లేదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి ఇంద్రసేనా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.


