కొనుగోలు కేంద్రాల్లో సమస్యల కుప్ప
● నత్తనడకన మక్కల సేకరణ
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
● పట్టించుకోని అధికారులు
తాడ్వాయి : కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధానంగా గోనె సంచుల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తాడ్వాయి మండలంలో వర్షాధారంగా ఎక్కువగా మక్క సాగవుతుంది. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సింగిల్‌విండోల ఆధ్వర్యంలో తాడ్వాయి ఎండ్రియాల్, ఎర్రాపహాడ్, దేమికలాన్, కన్‌కల్, కరడ్‌పల్లి, సంగోజీవాడి, కాళోజీవాడి, బ్రాహ్మణపల్లి, కృష్ణాజీవాడి, సోమారంలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే సరిగా కొనుగోళ్లు జరక్కపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. మండలంలో ఇప్పటివరకు 50 వేలకుపైగా క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. మరో 50 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాల్సి ఉంది. గన్నీ సంచులు, సుతిల్ తాళ్లు లేక తరచూ కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల తీరుతోనూ రైతులు విసిగిపోతున్నారు. వరుస క్రమంలో కాకుండా ఇష్టారీతిన మక్కలు సేకరిస్తున్నారని, తాము నెలరోజులుగా వేచి చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మక్కల సేకరణ నత్తనడకన సాగుతుండడంతో చాలామంది రైతులు విసుగు చెంది దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు తక్కువ ధర చెల్లిస్తుండడంతో నష్టపోతున్నారు. మరోవైపు సేకరించిన మక్కలకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలలో జమ కావడం లేదు. మంగళవారంతో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. మక్కలను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.


