గల్ఫ్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా..
● వలస కార్మిక సంఘాల పోరుబాట
● ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు లేఖలను అందించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ
మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాటను ఆరంభించాయి. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలను ఆరంభించే అవకాశం ఉండటంతో అప్పట్లోగా తమ డిమాండ్లను ప్రజాప్రతినిధుల దృష్టికి చేరవేయాలనే సంకల్పంతో వలస కార్మిక సంఘాలు లేఖలు రాస్తున్నాయి. రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలను స్వయంగా కలిసి లేఖలను అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకవస్తారనే ఆలోచనతో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్యాచరణ మొదలు పెట్టారు.
కొన్ని అంశాలపై దృష్టిసారించినా...
ఇప్పటికే రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గల్ఫ్ వలస కార్మికులకు సంబంధించి కొన్ని అంశాలపై దృష్టిసారించింది. అవి పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో వలస కార్మికుల కుటుంబాలకు ప్రయోజనాలు దక్కడం లేదు. దీంతో డిమాండ్ల సాధన కోసం బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని ఇప్పటి నుంచే నడుం కట్టాలని వలస కార్మిక సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. ఆదివారం ప్రారంభించిన లేఖల అందజేత కార్యక్రమంను రోజూ కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఈక్రమంలో ఒక్కో ప్రజాప్రతినిధిని స్వయంగా కలిసి డిమాండ్లను వినిపించనున్నారు.


