పరుగు పందెంలో సత్తాచాటిన అక్కాచెల్లెళ్లు
బోధన్‌టౌన్(బోధన్): జిల్లాకేంద్రంలో ఇటీవల నిర్వహించిన పరుగుపందెం పోటీల్లో బోధన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. పట్టణంలోని విజయసాయి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న తోకల అనన్య, తోకల మోక్ష అక్కాచెల్లెల్లు. జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో అథ్లెటిక్ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 12 బాలికల విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో వారు పాల్గొన్నారు. 6వ తరగతి చదువుతున్న అనన్య ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక అవ్వగా, 5వ తరగతి చదువున్న మోక్ష తృతీయ స్థానంలో నిలిచి సత్తా చాటిందని అథ్లెటిక్స్ ఫిట్‌నెస్ క్లబ్ బోధన్ కోచ్ రహన్ తెలిపా రు. పరుగు పందెంలో అక్కాచెల్లెల్లు విజేతలు గా నిలవడం అభినందనీయం కోచ్ అన్నారు.
ఆవుల మందపై చిరుత దాడి
నిజాంసాగర్(జుక్కల్): చిరుత దాడి చేసిం ఆవును హతమార్చిన ఘటన శుక్రవారం రాత్రి మండలంలోని చెరువు ముందరి తండా శివారులో చోటు చేసుకుంది. తండాకు చెందిన లాల్‌సింగ్ తన పశువులను గ్రామ శివారులోని కొట్టంలో కట్టేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ అటవీప్రాంతం నుంచి వచ్చిన చిరుత కొట్టంలోకి చొరబడడంతో పశువులు పరుగు తీశాయి. చిరుత దాడిలో ఒక ఆవు హతమైంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సెక్షన్ అధికారి శంకరప్ప ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. చిరుత దాడి వాస్తమేనని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని అన్నారు. రాత్రి వేళ రైతులు పంట పొలాల వద్దకు వెళ్లొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


