రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో జిల్లా వాసుల సత్త
కామారెడ్డి టౌన్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా వాసులు తమ సత్తా చాటారు. 45 ఏళ్ల పైబడిన వయసు విభాగంలో నిర్వహించిన 10 కిలోమీటర్ల పరుగు పందెంలో జిల్లా కేంద్రానికి చెందిన గెరిగంటి లక్ష్మీనారాయణ ఉత్తమ ప్రతిభ కనబర్చి నిర్ణీత లక్ష్యాన్ని కేవలం 45 నిమిషాల 36 సెకన్లలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన లక్ష్మీనారాయణకు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ స్వర్ణ పతకం, విజేత సర్టిఫికేట్ అందజేశారు. ఇదే కేటగిరీలో జిల్లా కేంద్రానికి చెందిన దండబోయిన నరేందర్ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు. 35 వయస్సు పైబడిన కేటగిరీలో మహమ్మద్ జునోద్దీన్ రెండవ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. విజేతలను జిల్లా అథ్లెటిక్ ప్రధాన కార్యదర్శి నరేశ్‌కుమార్, క్రీడా అభిమానులు అభినందించారు.


