యువకుడిపై గొడ్డలితో దాడి
● ఘాతుకానికి పాల్పడింది
సమీప బంధువే
● మద్యం తాగి మాటామాటా పెరిగి
ఘర్షణకు దిగిన ఇరువురు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామంలో యువకుడిపై అతడి సమీప బంధువే గొడ్డలితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. ముదెల్లి గ్రామానికి చెందిన కాగుల మోహన్ శుక్రవారం కట్టమైసమ్మ పండుగ చేసి, అక్కడే భోజనాలు చేశారు. అనంతరం రాత్రి వరుసకు మామాఅల్లుళ్లు అయిన నట్టోల్ల నర్సింలు, చింతకింది రంజిత్, గ్రామానికి చెందిన మరో ఇద్దరు కలిసి నర్సింలు ఇంటివద్ద మద్యం తాగారు. రంజిత్, నర్సింలు సమీప బంధువులు కావడంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహించిన నర్సింలు గొడ్డలితో రంజిత్‌పై దాడి చేయగా మెడపై తీవ్ర గాయమైంది. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం బాన్స్‌వాడ ఆస్పత్రికి తరలించారు. కాగ నర్సింలుతో పాటు సంతో ష్, చాకలి బాలయ్య, కాగుల మోహన్ యాదవ్, కాగుల రాము, కాగుల మారుతిలపై బాధితుడి సోదరుడు ప్రశాంత్ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ దాడికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు.


