కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు
కామారెడ్డి టౌన్: పెండింగ్ బిల్లులు, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు శనివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆశాలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్లు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న బారికేడ్లను తొలగించి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. గేటు ముందే బైఠాయించి ప్రభుత్వం, అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందూరి చంద్రశేఖర్, ముదాం అరుణ్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా వర్కర్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ. 18 వేల ఫిక్స్‌డ్ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కొత్త నర్సింలు, ఆశా వర్కర్‌లు రాజశ్రీ, మమత, సంగీత, గీత తదితరులు పాల్గొన్నారు.


