వృద్ధురాలి దారుణ హత్య
● ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని కొట్టి చంపిన దుండగులు
● లింగంపేట మండలం పొల్కంపేటలో చోటుచేసుకున్న ఘటన
లింగంపేట(ఎల్లారెడ్డి): బంగారం కోసం ఓ వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు హతమార్చిన ఘటన లింగంపేట మండలంలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. పొల్కంపేట గ్రామానికి చెందిన నరేంద్రుల సులోచన(69)కు ఇద్దరు కుమారులు రాజు, శ్రీని వాస్, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. సులోచన భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందడంతో ఇద్దరు కుమారు లు ఆమెను వంతుల వారీగా పోషిస్తున్నారు. ఈక్రమంలో సులోచన వారం రోజుల క్రితం పెద్ద కుమారుడు రాజు వద్దకు వెళ్లింది. తల్లిని ఇంటి వద్ద ఉంచి రాజు తన భార్య, పిల్లలతో కలిసి మూడు రోజుల క్రితం తిరుపతికి వెళ్లారు. శు క్రవారం రాత్రి వారు నాగిరెడ్డిపేటకు చేరుకోగా అక్కడే ఉన్న తన పెద్ద అక్క వద్దకు వెళ్లారు. పొల్కంపేటలో వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉండగా, దుండగులు రాత్రివేళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, కొట్టి చంపారు. శనివారం ఉదయం వృద్ధురాలి హత్యను గుర్తించిన స్థానికులు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా వృద్ధురాలి ఇంటి పరిసరాల్లోని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


