క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వర్ని: చందురు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. వర్ని ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన హంస్డా (30) ఇటీవల వ్యవసాయ పనుల కోసం చందూరుకు వచ్చింది. స్థానికంగా నివాసం ఉంటూ వ్యవసాయ కూలీగా పనులు చేస్తుంది. బుధవారం రాత్రి ఆమె బహిర్భూమికి వెళ్లగా, చందురు శివారులో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రాజంపేట(భిక్కనూరు): రాజంపేట శివారులో పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఎస్సై రాజు గురువారం తెలిపారు. మండల కేంద్రం సమీపంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.44,770 నగదును, ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్‌ప్లాజా వద్ద ముందు వెళ్తున్న ఓ కారును స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ చెందిన క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు విహారయాత్ర కోసం గురువారం రెండు స్కూల్ బస్సుల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద ముందు వెళ్తున్న కారును ఒక స్కూల్ బస్సు వెనుకనుంచి ఢీకొంది. దీంతో కారు ముందుకు వెళ్లడంతో కారు కంటే ముందు ఉన్న మరో స్కూల్ బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండువైపులా దెబ్బతినగా, కారులో ప్రయాణిస్తున్న సదాశివనగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రకాశ్ గాయపడ్డాడు. బస్సులో ఉన్న విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పాఠశాల యాజమాన్యం వెంటనే మరో రెండు బస్సులను స్కూల్ నుంచి రప్పించి విద్యార్థులను హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
క్రైం కార్నర్


