క్రైం కార్నర్
ఆటో ఢీకొని ఒకరి మృతి
బోధన్‌రూరల్: సాలూర మండలంలోని హున్సా గ్రామానికి చెందిన ముద్ద రాజ్‌కుమార్ (54) అనే వ్యక్తి ఆటో ఢీకొని మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ముద్ద రాజ్‌కుమార్ పని నిమిత్తం బోధన్‌కు వెళ్తుండగా సాలూర శివారులో ఎదురుగా అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తమ్ముడు సంగ్రామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.
రామారెడ్డి: పురుగుల మందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. రామారెడ్డికి చెందిన చాతరబోయిన శంకర్(53) ఈ నెల 23న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయాడు. సొంత పొలం దగ్గర గడ్డిమందు సేవించి అపస్మారకస్థితిలో కనిపించడంతో కుటుంబసభ్యులు మొదట కామారెడ్డి ఆస్పత్రికి అనంతరం నిజామాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందాడు. మృతుడి భార్య చిన్న పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు.


