పొరపాట్ల వల్ల కొన్ని చోట్ల గెలవలేకపోయాం
బాన్సువాడ: ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా కాంగ్రెస్ మద్దతు సర్పంచులు గెలిచిన నియోజకవర్గంగా బాన్సువాడ ఫస్ట్ స్థానంలో నిలిచిందని, బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు బాన్సువాడలో మూడు చోట్లనే గెలవడంతో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలోని ఎస్‌ఎంబీ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. పొరపాట్ల వల్ల కొన్ని చోట్ల గెలవలేకపోయామన్నారు. దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి ఉంటే గ్రామ ప్రథమ పౌరుడిగా సర్పంచు ఉంటారని అన్నారు. తనకు కూడా 1983లో పోచారం సర్పంచ్ కావాలని ఆకాంక్ష ఉండేదని, కానీ రిజర్వేషన్ల కారణంగా ఇప్పటి వరకు సర్పంచు కాలేకపోయానని అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేలా, వీధులన్నీ శుభ్రంగా ఉండేలా, వీధి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం కృషి చేసే వారికి బి. ఫారాలు ఇస్తామని అన్నారు.
త్వరలో రైతు భరోసా నిధులు: ఎంపీ సురేష్ షెట్కార్
రైతుల ఖాతాల్లో త్వరలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. నూతనంగా ఎన్నికై న సర్పంచులకు అభినందనలని, రెండేళ్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని, అత్యవసర పనులకు నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచులుగా గెలిచిన వారు కూడా అందరితో కలిసిపోవాలని అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, బద్యానాయక్ తదితరులున్నారు.
సర్పంచు కావాలనే తన కోరిక
నెరవేరలేదు
సర్పంచుల సన్మాన కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి


