అధికార పార్టీ ప్రలోభాలకు లొంగొద్దు
● కేసీఆర్ బాటలోనే నడుద్దాం
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి టౌన్: అధికార పార్టీ చేసే ప్రలోభాలకు లొంగి పార్టీలు మారవద్దని, నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు సూచించారు. నియోజకవర్గంలో పార్టీ మద్దతుతో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులకు బుధవారం జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు నయాపైసా మంజూరు చేయలేదని విమర్శించారు. రాబోయే కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేస్తుందని, వాటిని ఆపే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో మిమ్మల్ని గెలిపించారని, కేసీఆర్ చూపిన బాటలో నడిచి పల్లెలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ వేధింపులకు గురిచేస్తే భయపడాల్సిన పనిలేదని, జిల్లాలో పార్టీ తరపున ఉచిత లీగల్ టీం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం వారిని ఘనంగా సన్మానించారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ జెడ్పీటీసీలు గోపి గౌడ్, రామ్ రెడ్డి, అశోక్, మండల పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్, రాజా గౌడ్, బలవంతరావు, ప్రభాకర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక
భిక్కనూరు: బస్వాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత గౌరిగారి మహిపాల్‌రెడ్డి బుధవారం మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కండువాను కప్పి స్వాగతించారు. బీఆర్‌ఎస్ నేతలు బుర్రి గోపాల్, మల్లారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


