బెంబేలెత్తిస్తున్న బెబ్బులి
● మరో మూడుచోట్ల పశువులపై దాడి
● ఆందోళనలో ప్రజలు
దోమకొండ పాత తాలూకా పరిధిలోని మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో నాలుగైదు రోజులుగా పెద్దపులి సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతోంది. అంబారిపేటలో లేగదూడను బలితీసుకున్న సంఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు.. వేట మొదలుపెట్టారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి బెబ్బులి పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, మాందాపూర్, సంగమేశ్వర్, జనగామ, అంబారి, ఫరీదుపేట, బండరామేశ్వర్‌పల్లి గ్రామాల శివారు ప్రాంతాల గుండా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పెద్దమల్లారెడ్డిలో ఓ రైతు చేను వద్ద కట్టేసిన ఆవుపై దాడి చేసి దాన్ని చెరకు తోటలోకి లాక్కెళ్లి తిన్నట్లు గుర్తించారు. తర్వా సంగమేశ్వర్ గ్రామ శివారులో లేగదూడపైనా దాడి చేసింది. అంబారిపేట శివారులో గేదైపె దాడి చేసి చంపేసింది. పులి కదలికల ఆధారంగా చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా భావిస్తున్నామని జిల్లా అటవీ అధికరి నిఖిత ‘సాక్షి’తో తెలిపారు.
పొలాలకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు
యాసంగి పంటలు సాగు చేసే సమయంలో పెద్దపులి సంచరిస్తుండడంతో రైతులు పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మైదాన ప్రాంతం కావడంతో పులి పొదల చాటున ఉండాల్సిందే. దీంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. అంబారిపేట ప్రాంతంలో మూడు రోజులుగా రైతులకు కునుకు ఉండడం లేదు. దాదాపు అందరూ పశువులను పొలాల దగ్గర గుడిసెలు, పందిళ్ల కింద కట్టేసి వస్తుంటారు. పులి దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ వైపు నుంచి పులి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.
సాధారణంగా పెద్దపులులు దట్టమైన అటవీ ప్రాంతంలో తిరుగుతాయి. వాటికి అక్కడే రక్షణ ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో పులి తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో ప్రస్తుతం పెద్దపులి తిరిగినట్టు భావిస్తున్న గ్రామాల శివార్లలో గుట్టలు ఉన్నాయి తప్ప ఎక్కడా అడవైతే లేదు. అలాంటి మైదాన ప్రాంతంలో పులి సంచరిస్తుండడం సంచలనంగా మారింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారు దాటి ఇసాయిపేట, అన్నారం వైపు వెళితేనే అటవీ ప్రాంతం ఉంటుంది.
పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ అధికారులకు కునుకు కరువైంది. మూడు రోజులుగా దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, భిక్కనూరు మండలాల్లోని ఆయా ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పులి ఎటువైపు వెళ్లిందన్న దాన్ని పసిగట్టేందుకు పులి అడుగులను గమనిస్తూ కిలోమీటర్ల మేర నడక సాగించారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి రేంజ్‌లలో పనిచేసే అటవీ అధికారులు, సిబ్బంది ఎక్కడినుంచి పులి దాడి చేసిందన్న సమాచారం వచ్చిన్నా ఆ గ్రామాలకు వెళుతున్నారు. అక్కడి పరిసరాలను పరిశీలించి అడుగులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
బెంబేలెత్తిస్తున్న బెబ్బులి


