నేడు తుది పోరు
ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
ఎన్నికలు జరిగే పంచాయతీల వివరాలు..
● ఎనిమిది మండలాల్లో 142 సర్పంచ్,
1,020 వార్డులకు ఎన్నికలు
● పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన
అధికారులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. మూడో విడత ఎన్నికలకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు మంగళవారమే చేరుకున్నారు.
చివరి విడతలో జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో 168 గ్రామాల సర్పంచ్, 1,482 వార్డులున్నాయి. 26 మంది సర్పంచ్‌లు, 449 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. 13 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 142 గ్రామాల సర్పంచ్, 1,020 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 142 గ్రామాల సర్పంచ్ పదవులకు 462 మంది, 1,020 వార్డులకు 2,790 మంది పోటీ పడుతున్నారు. బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కేంద్రాలకు చేరిన సిబ్బంది..
మూడో విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాలకు మంగళవారమే పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని తీసుకుని వెళ్లారు. పలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి తదితరులు సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు.
భద్రత విధుల్లో 812 మంది..
తుది విడత పోలిం గ్‌కు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 812 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.
కామారెడ్డి క్రైం: చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదంచెల భద్రతా వ్యవస్థలో మొత్తం 812 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు, అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, 8 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను మోహరించామని తెలిపారు. మూడో విడతలో ఉన్న 10 సమస్యాత్మక, 9 సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంక్ బాటిళ్లు, ఇంక్ పెన్నులు, అగ్గిపెట్టెలు, వాటర్ బాటిళ్లు, కత్తులు తీసుకురావడం నిషిద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.8,52,170 విలువైన 1,054.54 లీటర్ల మద్యం, రూ.4,50,250 విలువైన 1.635 కిలోల గంజాయి, 43 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేర చరిత్ర కలిగిన 211 మందిని బైండోవర్ చేశామని, ఎన్నికల నియమావళి పరిమితికి మించి తీసుకెళ్తున్న రూ.10,89,000 నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 18 కేసులు నమోదు చేశామని తెలిపారు.


