పోలింగ్ సజావుగా జరగాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
బిచ్కుంద/నిజాంసాగర్(జుక్కల్): మూడో విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోలింగ్ అధికారులకు సూచించారు. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాలన్నారు. బిచ్కుంద మార్కెట్ యార్డు, జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం సందర్శించారు. బస్సులలో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడో విడతలో 144 గ్రామ పంచాయతీలు, 1020 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. బూత్‌లు, గ్రామాల వారీగా ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఎన్నికల సిబ్బంది సహకరించాలన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే మీ పైఅధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవోలు గోపాల్, శ్రీనివాస్ తదితరులు అధికారులు ఉన్నారు.
నిబంధనలను పాటించాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో జరుగుతున్న మూడో దశ గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బుధవారం ఎన్నికలు జరిగే అన్ని మండలాల పరిధిలో ఉదయం 5 నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల సామగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.


