పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!
● డివిజినల్ కమిటీ మెంబర్ హోదాలో పనిచేస్తున్న ఎర్రగొల్ల రవి
● రూ.5 లక్షల రివార్డు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ సోమవారం రాత్రి పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రామయ్య, భూమవ్వల కుమారుడైన ఎర్రగొల్ల రవి 2001 లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆయన దండకారణ్యంలోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి ఆయన నుంచి ఇంటి ముఖం చూడలేదు. కొడుకుకోసం తల్లి భూమవ్వ ఎంతగానో తపించింది. లొంగిపోవాలని కొడుకును కోరిన ఆమె తన కోరిక తీరకుండానే ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ రెండున్నర దశాబ్దాలుగా పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీలలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం డివిజనల్ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నట్లు సమాచారం. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ దండకారణ్యంలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు రమేశ్ కూడా అజ్ఞాతంలో పనిచేస్తూ ఇటీవలే లొంగిపోయిన విషయం తెలిసిందే.


