గ్రామాల్లో చాటింపు
దోమకొండ/మాచారెడ్డి: దోమకొండనుంచి అంబారిపేటకు వెళ్లే దారిలో ఇటుకబట్టి వద్ద రైతు శ్రీనివాస్‌కు చెందిన బర్రెను మంగళవారం తెల్ల వారుజామున పులి చంపివేసింది. కొంతసేపటికే సంఘమేశ్వర్ శివారులో రైతు నారాయణకు చెందిన ఆవునూ చంపేసింది. అంబారిపేటలో బర్రె ను చంపిన స్థలాన్ని జిల్లా అటవీ అధికారి నిఖిత, డివిజనల్ పారెస్ట్ అధికారి రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ అఽధికారి శివకుమార్ పరిశీలించారు. ఫరీద్‌పేట, అంబారిపేట, గొట్టిముక్కుల, మందాపూర్ ప్రాంతాల్లో ఎడ్లకట్ట వాగు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. అంబారిపేట, సంఘమేశ్వర్ శివార్లలో పశువులపై దాడి చేసిన పెద్దపులి చుక్కాపూర్, మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని గుర్తించామన్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు గ్రామాలలో చాటింపు వేయించారు. ఫారెస్ట్ బీట్ అధికారులు పద్మ, పారూఖ్, అంబారిపేట సర్పంచ్ అరుట్ల కవిత, సంఘమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్‌రావు తదితరులు అధికారుల వెంట ఉన్నారు.
మాచారెడ్డి మీదుగా..
కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను వణికిస్తున్న పెద్దపులి మంగళవారం రాత్రి మాచారెడ్డి మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దమ్మ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ట్రాక్ కెమెరాల్లో నమోదైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.


