సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత

Dec 16 2025 4:53 AM | Updated on Dec 16 2025 4:53 AM

సోమార

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత

హత్యాయత్నం కేసు నమోదు

బాధితులకు పరామర్శ

ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడి

ట్రాక్టర్‌తో ఢీకొట్టిన సర్పంచ్‌ తమ్ముడు

ఆందోళనకు దిగిన గ్రామస్తులు

ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్‌: ఎన్నికలలో గెలిచినా ఆ సర్పంచ్‌ కుటుంబం సంతృప్తి చెందలేదు. బరిలో నిలిచి తమను ఇబ్బందులు పెట్టాడని ప్రత్యర్థిపై కక్ష పెంచుకున్న సదరు సర్పంచ్‌ తమ్ముడు.. ఏకంగా ట్రాక్టర్‌తో దాడి చేశాడు. ఐదుగురికి గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సోమార్‌పేట్‌లో సర్పంచ్‌ పదవి కోసం కుర్మ పాపయ్యతోపాటు బిట్ల బాలరాజు పోటీ చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో పాపయ్య విజయం సాధించారు. అయితే ఓడిపోయిన బాలరాజును సోమవారం పలువురు పరామర్శించారు. ఇంటిముందు కూర్చొని మాట్లాడుతుండగా.. ఆ దారిలో ట్రాక్టర్‌ తీసుకుని వచ్చిన సర్పంచ్‌ తమ్ముడు కుర్మ చిరంజీవులు అక్కడున్నవారిని ఢీకొట్టాడు. ట్రాక్టర్‌ దుక్కి దున్నే నాగలి కింద గంజి భారతి ఇరుక్కు పోవడంతో ఆమె నడుము విరిగి పోయింది. బూడమీద బాలమణి చేయి విరిగింది. మూడేళ్ల బాలుడు అద్విక్‌ కాలు విరగ్గా.. తోట శారద, పద్మ సత్యవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంజి భారతి, బాలమణి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన ముగ్గురు ఎల్లారెడ్డిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎల్లారెడ్డిలో రాస్తారోకో..

ఎన్నికలలో తన అన్నకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కుర్మ చిరంజీవులు కక్ష పెంచుకున్నాడని, అతడు కావాలనే ట్రాక్టర్‌తో ఢీకొట్టాడని సోమార్‌పేట్‌ గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఎల్లారెడ్డిలోని రామాలయం వద్దనున్న ప్రధాన రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత అందరి సంగతి చూసుకుంటామని సర్పంచ్‌, అతడి తమ్ముడు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబాలు బెదిరించారని గ్రామస్తులు ఆరోపించారు. ట్రాక్టర్‌తో దాడి చేసిన చిరంజీవులుతో పాటు సర్పంచ్‌ పాపయ్య, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక పోలీసు బలగాలు..

రాస్తారోకోను విరమింపజేసేందుకు పోలీసులు ప్ర యత్నించినా ఎవరూ వినలేదు. దీంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్‌ ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు. ఎస్పీ రాజేశ్‌ చంద్ర మాజీ ఎమ్మెల్యే జాజాలతో ఫోన్‌లో మాట్లాడా రు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. ఆందోళనలో బీఆర్‌ఎస్‌ నాయకు లు జలంధర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, సతీష్‌, బీజేపీ నాయకులు నర్సింలు, బాలకిషన్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరా

ఎల్లారెడ్డి: సోమార్‌పేట్‌ సంఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే జాజాలతో ఫోన్‌ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేటీఆర్‌ ఎస్పీతో ఫోన్‌ ద్వారా మాట్లాడారని, సర్పంచ్‌ తమ్ముడితో పాటు దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని జాజాల సురేందర్‌ తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్‌ మంగళవారం సోమార్‌పేట్‌కు రానున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం ఆయన సోమార్‌పేట్‌కు వస్తారని పేర్కొన్నారు.

సోమార్‌పేట్‌లో ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాలని చూసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్‌ తెలిపారు. గ్రామ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసినప్పటినుంచి తన ప్రత్యర్థి అయిన కురుమ పాపయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కుర్మ సాయి బాబా, కుర్మ శంకర్‌, కుర్మ చిరంజీవులు, కుర్మ సాయిలు, కుర్మ స్వప్న, కుర్మ లత, కుర్మ శోభ, కుర్మ దుర్గవ్వ బెదిరింపులకు దిగుతున్నారని బిట్ల బాలరాజు ఆరోపించారు. తమకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, మీ అంతు చూస్తామని బెదిరించారని పేర్కొన్నారు. సోమవారం కురుమ చిరంజీవులు అనే వ్యక్తి ట్రాక్టర్‌తో ఢీకొట్టగా ఐదుగురికి గాయాలయ్యాయని, తాను తప్పించుకున్నానని.. ట్రాక్టర్‌తో దాడి చేసిన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

సోమార్‌పేట్‌ ఘటనలో గాయపడిన తోట శారద, అద్విక్‌, పద్మ సత్యవ్వలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అనుచరులు నియోజకవర్గంలో రౌడీయిజం చెలాయిస్తున్నారన్నారు. అమాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. సోమార్‌పేట్‌లో ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఐదుగురిని గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత1
1/2

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత2
2/2

సోమార్‌పేట్‌లో ఉద్రిక్తత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement