వచ్చింది పెద్దపులే!
దోమకొండ మండలం అంబారిపేట శివారులోని పంట చేల వద్ద ఆదివారం దూడలపై పులి దాడి నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించిన అధికారులు.. అవి కచ్చితంగా పెద్దపులివే అన్న నిర్ధారణకు వచ్చారు. వెంటనే అక్కడికి చుట్టుపక్కల ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దూడలను చంపిన ప్రాంతంలో పులి సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. జిల్లా అటవీ అధికారి బోగ నిఖిత ఆ ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. పెద్దపులి ఎటువైపు నుంచి ఎటు వెళ్లిందన్న దానిపై అటవీ సిబ్బందితో సమీక్షించారు.
రైతుల్లో ఆందోళన
జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్ తిరిగిన ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రాలే కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి వరి నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నవారు భయపడుతున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి ఆవులపై దాడులు చేసింది. అయితే దాని జాడ కోసం దాదాపు నెల రోజుల పాటు అటవీ అధికారులు నిఘా వేసినా అది ఎటువైపు వెళ్లిందో తేల్చలేకపోయారు. నాలుగు నెలల తర్వాత మరో పులి రావడం సంచలనంగా మారింది. మైదాన ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి ఎవరిపై పంజా విసురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. పెద్దపులి జాడ వెలుగు చూసిన అంబారిపేటకు చుట్టుపక్కల గ్రామాలైన గోపాల్‌పేట, కోనాపూర్, యాడారం, ఫరీదుపేట, బండరామేశ్వర్‌పల్లి, లచ్చాపేట తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. అటువైపు పెద్దపులి రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కవ్వాల్ నుంచి వచ్చిందా...?
అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి జాడలు బయటపడిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై అటవీ అధికారులు దృష్టి సారించారు. మన దగ్గర పులులు లేవన్న కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అటవీ అధికారులు.. అప్పట్లో జిల్లాలో తిరిగిన పెద్దపులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వివిధ జిల్లాలు తిరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో దాని కదలికలు బయటపడ్డాయి. అయితే అప్పట్లో ట్రాప్ కెమెరాల ద్వారా దాని కదలికలు కనుక్కునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అది ఎటువైపు వెళ్లిందన్నదీ స్పష్టం కాలేదు. తాజాగా అంబారిపేట ప్రాంతంలో దూడలపై పెద్దపులి దాడి చేయడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలపై నిఘా పెట్టారు. ఇప్పటికే కెమెరాలకు చిక్కడంతో పెద్దపులి ఇదే ప్రాంతంలో ఉండి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరీవాహక ప్రాంతంతో పాటు పాల్వంచ వాగు పరీవాహక ప్రాంతంలో తిరుగుతుండవచ్చని భావిస్తున్నారు.


