ష్.. గప్‌చుప్!
● ముగిసిన పంచాయతీ
ఎన్నికల ప్రచార పర్వం
● రేపు చివరి విడత పోలింగ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సైలెన్స్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
జిల్లాలో చివరి విడతలో బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి, మలి విడతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. చివరి విడతలోనూ పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల నేతలు సైతం తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చివరి నిమిషం దాకా ప్రచారం చేశారు. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లభ్యర్థిస్తూనే పలుచోట్ల ర్యాలీలు తీశారు.
ప్రచారంలో పార్టీల ప్రముఖులు
ఎన్నికల్లో తమ తమ పార్టీల మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అభివృద్ధిని చూసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన తనయుడు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. బీఆర్‌ఎస్ మద్దతుదారుల కోసం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌లో రెండు గ్రూపులున్నాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గీయులతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులు చాలాచోట్ల పోటీచేస్తున్నారు. ఎవరికివారే పోటాపోటీగా ప్రచారం చేశారు. బీజేపీ నేతలు కూడా వారి మద్దతుదారుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చాలా గ్రామాల్లో ప్రచారం చేశారు. అభివృద్ధి కోసం తమ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్‌గల్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కూడా చాలా గ్రామాల్లో తమ పార్టీ మద్దతుదారుల కోసం ప్రచారం చేశారు. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేదాకా తమ పార్టీకి చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ మద్దతుదారుల తరఫున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార ప్రచారం చేశారు.


