అవినీతి రహిత కామారెడ్డికి కృషి చేయాలి
● తాయిలాలు ఇవ్వకుండా గెలిస్తేనే
ప్రజాసేవ చేస్తాం
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్: అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా విజయం సాధించినప్పుడే ప్రజలకు సేవ చేయగలమన్నారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిస్తే ప్రజల సొమ్ము దారి తప్పి అభివృద్ధి కుంటపడుతుందన్నారు. ప్రజా సేవ కోసమైతేనే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఓటర్లు కూడా మద్యం, డబ్బుకు లొంగకుండా నిజాయితీపరులను, ప్రజా సేవకులను గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ మద్దతుదారులు మద్యం, డబ్బు పంచకుండా పోటీ చేసి గెలుపొందడం అభినందించదగ్గ విషయమన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే విజయ స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు.


