మూడో దశ పోలింగ్‌కు ర్యాండమైజేషన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్‌లో చేపట్టారు. సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ల ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: చౌకధరల దుకాణాల ద్వారా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యంను ఈనెల 18 వరకు పంపిణీ చేయన్నారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల అధికారులు తెలిపారు. విడతల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో బియ్యం పంపిణీని పొడిగించామని పేర్కొన్నారు.
కామారెడ్డి క్రైం: తమను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన పలువురు దళితులు అదనపు కలెక్టర్ విక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం వారు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ గ్రామంలో 40 దళిత కుటుంబాలున్నాయన్నారు. గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయాడని, అంత్యక్రియల్లో డప్పు కొట్టాలని అతడి కుటుంబ సభ్యులు అడిగారని పేర్కొన్నారు. అయితే తమ పిల్లలందరూ చదువుకుంటున్నారని, డప్పు కొట్టేవారు లేరని చెప్పామని వివరించారు. దీంతో గ్రామ పెద్దలు 40 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, వైద్యం, రవాణా సదుపాయాలు అందకుండా చూస్తున్నారన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలను అతిక్రమిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయమై ఎస్పీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేస్తామన్నారు.
మూడో దశ పోలింగ్‌కు ర్యాండమైజేషన్


