భిక్కనూరులో చిరుత పులి సంచారం
భిక్కనూరు: మండలంలోని లక్ష్మిదేవునిపల్లి, బంజర్ల, కాచాపూర్ శివారుల్లోని వ్యవసాయ క్షేత్రాల వద్ద చిరుతపులి సోమవారం వేకువజామున సంచరించింది. దూరం నుంచి చూసిన రైతులు పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సెక్షన్ అధికారి బాబా, బీట్ అధికారులు దీపిక, సురేశ్ పరిశీలించి ఆనవాళ్లను సేకరించారు. చిరుతకు సంబంధించిన కాలి గుర్తులు కనిపించాయని అటవీశాఖాధికారులు తెలిపారు.
చిరుత దాడి.. దూడ మృతి
తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ శివారులో గల వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన దూడపై చిరుత దాడిచేసింది. గ్రామానికి చెందిన భూంపల్లి సంగయ్య రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం దూడను గ్రామ శివారులోని తన కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వచ్చారు. రాత్రి పశువులకు మేత(గడ్డి)ను వేసేందుకు వెళ్లగా కట్టేసిన దూడను చిరుత పులికొరికి చంపివేసినట్లు కనిపించింది. దీంతో సంగయ్య భయాందోళన చెంది గ్రామస్తులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు చిరుత దాడిచేసి చంపినట్లు నిర్ధారించారు. కాగా, ఎర్రాపహాడ్ శివారు పక్కనే ఉన్న మోతే శివారులో చిరుత తిరుగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. సోమవారం ముస్తాపూర్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఎర్రాపహాడ్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, మండల పశువైద్యాధికారి రమేశ్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించారు.


