బీజేపీ జెండా కనిపిస్తే భయపడుతున్నారు
సుభాష్‌నగర్: బీజేపీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, సర్పంచ్ ఎన్నిక ల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే ప్ర జల వద్దకు పాలన అందిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన 48 మంది పోటీ చేయగా.. 18 మంది విజయం సాధించారని సంతోషం వ్యక్తంచేశారు. కొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. రెండు, మూడు విడతల్లో మరిన్ని సర్పంచ్ స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఆ అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం మొదటి విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించారు.
పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..?
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తాకు దినేష్ సవాల్ విసిరారు. ఇటీవల ధన్‌పాల్ సూర్యనారాయణపై అవాస్తవ ఆరోపణలు చేసి గణేశ్‌గుప్తా తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ రెండేళ్లలో రూ.138 కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి,రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, పాల్గొన్నారు.


