సర్పంచులు @ పట్టభద్రులు
బీబీపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం బరిలో నిలిచి, గెలుపొందారు. బీబీపేట గ్రామ సర్పంచ్ ఏదుళ్ల సాద్విక ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి మీద 1470 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ప్రజల మన్ననలు పొందింది. ప్రచారంలో సైతం తాను విద్యావంతురాలినని, గ్రామాభివృద్ధే లక్ష్యంగారాజకీయాల్లోకి వస్తున్నాని, ఆశీర్వదించాలని కోరింది. దీంతో ప్రజలు ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు.
మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం కోసం 11 మంది బరిలో నిలువగా పీజీ పూర్తి చేసిన ఆకుల హరీష్ విజయం సాధించారు. ఆయనకు పోటీగా మాజీ సర్పంచులు ఇద్దరు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అలాగే రాజకీయ నాయకులు సైతం నిలిచినప్పటికీ హరీష్ చెప్పిన నిజాయితీ మాటలకే ప్రజలు పట్టం కట్టారు. 276 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పదవి పొందారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి సైతం నామినేషన్ వేశాడు. రాజకీయాల్లో కావల్సింది ప్రజాసేవ మాత్రమేనని దానికోసమే రాజకీయాల్లోకి ప్రవేశించానని ఆయన తెలిపారు.
నాడు భార్య ఎంపీటీసీ.. నేడు భర్త సర్పంచ్
మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రానికి చెందిన కూచని శేఖర్ సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి మాచారెడ్డి మండలంలో అత్యధికంగా 502 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అతడి భార్య లావణ్య ఎంపీటీసీగా పోటీ చేసి 705 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు 2011లో భార్యాభర్తలిద్దరూ వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తుండడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు.
సర్పంచులు @ పట్టభద్రులు
సర్పంచులు @ పట్టభద్రులు


