ప్లీజ్ ఏడవద్దు.. మనం ఓడి గెలిచాం
● 335 మందికి నేను ప్రతినిధిని
● భిక్కనూరులో బోర్డు
ఏర్పాటు చేసిన ఓడిన అభ్యర్థి
భిక్కనూరు: ‘‘డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం మాకు నచ్చదు. భిక్కనూరు గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, మార్పును తీసుకువద్దాం అనే ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేశాను. 335 మంది నా అభిప్రాయాలను సమర్థించారు. నేను ఓడిపోయినందుకు మీరు ఎవరూ ఏడవద్దు’’ అంటూ భిక్కనూరుకు చెందిన పెద్దబచ్చగారి మైత్రేయి తనను పలకరించేందుకు వచ్చి కంటనీరు పెట్టుకుంటున్న మహిళలను ఓదారుస్తున్నారు. మనం ఓడి గెలిచామని, తన కుటుంబం భిక్కనూరులోనే నివసిస్తూ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ విషయమై ఆమె తన ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పలువురు ఓటర్లు మైత్రేయి ఇంటికి వెళ్లి తాము ఓట్లు వేయాలంటే డబ్బులు, మందు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఆమె తిరస్కరించారు. ‘‘ఓట్లు కొనం.. పైసలు పంచం.. మందు తాగించం.. నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి’’ అంటూ ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత తనకు ఓటేసిన వారిని ఓదార్చుతూ ఏర్పాటు చేసిన బోర్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


