స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మాట్లాడారు. ప్రజల్లో విశ్వాసం కల్గించడానికి కవాత్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. లింగంపేటను సున్నిత ప్రాంతంగా గుర్తించినట్లు తెలిపారు. కవాతులో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్సై దీపక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పిట్లం(జుక్కల్): తాను ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే రెండున్నర సంవత్సరాలలో రాజీనామా చేస్తానని.. ముందుగానే అంబేడ్కర్ విగ్రహానికి రాజీనామా లేఖను అందజేశారు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి లోక మనోహర్. శుక్రవారం మండల కేంద్రంలో తన వర్గంతో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నీలకంటి లోక మనోహర్ మాట్లాడుతూ.. తాను 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నానని, ఓ పార్టీలో పనిచేస్తున్నా ఏనాడూ సముచిత స్థానం కల్పించలేదన్నారు. అందుకే స్వతంత్రంగా సర్పంచ్ బరిలో ఉన్నానని.. అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామస్తులు ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తనను సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ యువకుడు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్ డిపో–2కు చెందిన బస్సు శుక్రవారం బిచ్కుంద నుంచి పెద్దకొడప్‌గల్ మీదుగా హైదరాబాద్‌కి బయలుదేరింది. మండలకేంద్రంలో ఓ యువకుడు బస్సెక్కి చిన్నకొడప్‌గల్‌కు టికెట్ ఇవ్వమని కండక్టర్‌ను కోరాడు. దీంతో కండక్టర్ చిన్నకొడప్‌గల్‌కు స్టాప్ లేదని చెప్పి, అతడిని బస్సు దిగమని సూచించాడు. సదరు యువకుడు బస్సు దిగి రాయితో బస్సు వెనక అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే డ్రైవర్ బస్సు ఆపి, యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం ఓ టిప్పర్ ఆగింది. ఈక్రమంలో మండల కేంద్రంలోని ఎంఎస్‌ఎన్ కంపెనీకి చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ శ్రావన్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జీఎంఆర్ అంబులెన్స్‌లో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి


