సర్పంచ్ అభ్యర్థి ఇంట్లో అగ్నిప్రమాదం
● గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం ● చద్మల్ గ్రామంలో ఘటన
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చద్మల్ గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామస్తులు, గిర్దావర్ ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరాఠీ బాలయ్య, ఆయన కూతురు రోజా ఒకే గుడిసెలో నివాసుముంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వారు పనినిమిత్తం గాంధారికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెకు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు గమనించేలోపే పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఇంట్లో ఉన్న వంట సామగ్రి కాలిబూడిదయ్యాయి. గిర్దావర్ ప్రదీప్ బాధితుల వివరాలు సేకరించారు. కాగా, చద్మల్ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో రోజా పోటీలో ఉన్నారు. ఎన్నికల ఖర్చుల కోసం తెచ్చి పెట్టిన నగదు కాలిబూడిదైనట్లు బాధితులు తెలిపారని ఆర్‌ఐ తెలిపారు.


