భూమి తగాదాలతో ఒకరి దారుణ హత్య
● నిందితుల ఇంటి వద్ద బంధువుల ఆందోళన
బీబీపేట: భూ తగాదాలతో ఒకరు హత్యకు గురైన ఘటన బీబీపేట గ్రామ పరిధిలోని రాంరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన కోకట్ల సత్తయ్య (50), కాల్ల లచ్చయ్య, కాల్ల దేవయ్య వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలంగా భూ విషయమై తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 11:30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సత్తయ్య ఇంటి నుంచి బయటికి రావడంతో నిందితులు బలమైన ఆయుధంతో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన సత్తయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కాల్ల లచ్చయ్య, కాల్ల దేవయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం గ్రామానికి చేరుకున్న మృతుడి బంధువులు నిందితుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. లచ్చయ్య, దేవయ్యలు సత్తయ్యను హత్య చేశారని, వారిని తమకు అప్పగించాలని బైఠాయించారు. బాధితులను పోలీసులు, కుల పెద్దలు సముదాయించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.


