అభ్యర్థి ఎవరైనా.. ప్రచారకర్తలు వారే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా కొన్ని గ్రామాల్లో దినసరి కూలీలకు రోజువారీగా లభిస్తున్న ఉపాధితో కొంత ఊరట కలుగుతుంది. గ్రామంలో అభ్యర్థులెవరూ ప్రచారానికి వెళ్లినా వెంట వచ్చేందుకు ముందుగానే కూలీలను మాట్లాడుకుంటున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు కూలీలను వెంట తిప్పుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వెంటవచ్చినందుకు కూలీలకు టిఫిన్ చేయించి, టీ తాగించడంతోపాటు కొంత నగదును ముట్టజెప్పుతున్నారు. గ్రామాల్లో ఏ అభ్యర్థి ప్రచారం చేసిన వారే ఉండడం విశేషం. కానీ ఒక రోజు ఒక అభ్యర్థి వెంట వచ్చిన కూలీలే మరుసటిరోజు మరో అభ్యర్థి వెంట రావడం చూసి గ్రామాల్లో ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్నికల పుణ్యమా అని నిరుపేద కూలీలకు కొంత ఉపాధి కలుగుతుంది.
గెలుపు ధీమాలో అభ్యర్థులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతోపాటు 22 గ్రామ పంచాయతీల పరిధిలో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో తమను అభివృద్ధి పథకాలు గెలిపిస్తాయని అధికార పార్టీ మద్ధతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ తామంటే తామే గెలుస్తామని బీఆర్‌ఎస్, బీజేపీలు బలపరచిన అభ్యర్థులు ధీమాలో ఉన్నారు. ఒకరికంటే ఒకరు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఓటర్ల వద్దకు వచ్చి మద్యం, డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల నాయకులు కుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు.


