మేనమామ– అల్లుడి మధ్య పోటీ
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మేనమామ, మేనల్లుడికి మధ్య పోటీ నెలకొంది. బీర్కూర్ సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్ సానేపు గంగారాం పోటీలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మేనల్లుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మేకల విఠల్ రంగంలోకి దిగారు. గతంలో ఐదేళ్లు సర్పంచి పదవిలో కొనసాగిన సానేపు గంగారాంకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరుంది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో చాలా రోజులు ఆస్పత్రిలో ఉండి ఈ మధ్యనే ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉంటానని నామినేషన్ వేశారు. మాజీ సర్పంచ్ చెల్లెలి కుమారుడైన మేకల విఠల్ 40 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్‌గా పోటీ చేస్తానని కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించి నామినేషన్ వేశారు. మంగళవారం నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగియడంతో సర్పంచ్ పదవికి మేనమామ, మేనల్లుడు పోటీకి సై అంటున్నారు. పోటీలో మరొక అభ్యర్థి ధర్మతేజ(బీఆర్‌ఎస్ మద్దతుదారు) కూడా ఉన్నారు.
మేనమామ– అల్లుడి మధ్య పోటీ


