ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు
● ఎన్నికల నియమావళి పాటించాలి
● ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి
● ఎస్పీ రాజేశ్‌చంద్ర
నిజాంసాగర్(జుక్కల్): ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దని, శాంతి యుతంగా స్వేచ్ఛా వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇందుకు పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. జుక్కల్ మండలం సోపూర్ చెక్ పోస్టుతోపాటు మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్‌పోస్టుతోపాటు జుక్కల్ పోలీస్ స్టేషన్‌ను సోమవారం సాయంత్రం ఎస్పీ తనిఖీ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, డబ్బు రవాణా కాకుండా చెక్ పోస్టుల్లో తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, జుక్కల్ ఎస్సై రవికుమార్ తదితరులు ఉన్నారు.
విధులను నిర్లక్ష్యం చేయొద్దు..
బాన్సువాడ : విధులను నిర్లక్ష్యం చేయొద్దని ఎస్పీ రాజేశ్‌చంద్ర పోలీసు సిబ్బందికి సూచించారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను సోమవారం రాత్రి ఆయన సందర్శించారు. శాంతిభద్రతలపై ఆరా తీశారు. సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. రికార్డులు, క్రైం రిపోర్టులను పరిశీలించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.


