జిల్లాలో 2 కోట్ల 85 లక్షల చేప పిల్లల పంపిణీ లక్ష్యం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్: జిల్లాలోని 780 నీటి వనరుల్లో ఈ ఏడాది 2 కోట్ల 85 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం లక్ష్యమని జిల్లా మత్స్యశాఖ అధికారి డోలిసింగ్ తెలిపారు. సోమవారం ఎల్లారెడ్డిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సముదాయంలో ఎల్లారెడ్డి, సోమార్‌పేట్ గ్రామాల పరిధిలోని 11 మత్స్యసహకార సంఘాల సభ్యులకు ఆయన చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 652 సీజనల్ ట్యాంకుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు, ఏడాదిపాటు నీరు నిల్వ ఉండే 128 జలవనరుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై విడుదల చేస్తామన్నారు. ఇంత వరకు 202 ట్యాంకుల్లో 48 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని, మిగతా లక్ష్యాన్ని ఈనెల 15వ తేదీ వరకు పూర్తి చేస్తామని అన్నారు. మత్స్యశాఖ సహాయ అధికారులు సురేశ్, అతిఖ్, మత్స్యకార సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.


