హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా
పిట్లం(జుక్కల్): సర్పంచ్‌గా ఎన్నికై న తర్వాత తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తానని పిట్లం సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ అన్నారు. ఈమేరకు సోమవారం బాండ్ పేపర్ రాసి అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా విడుదల చేశారు. నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ.. తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, తానే స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పిట్లంలో తన వర్గం సభ్యులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


