సమస్యాత్మక గ్రామాలపై నజర్
నిబంధనలు పాటించాలి
● సర్కిల్ పరిధిలో 7 గ్రామాల గుర్తింపు
● 98 మంది బైండోవర్
బిచ్కుంద(జుక్కల్): ఎన్నికలు వచ్చాయంటే గొడవలు, ఘర్షణలు ఫలితాలు వచ్చే వరకు పోలీసులకు పరీక్షా కాలంగా ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా గొడవలకు తావు లేకుండా బిచ్కుంద సర్కిల్ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్దకొపడ్‌గల్ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ప్రణాళిలు రచించి ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి శాంతియుతంగా ఎన్నికలు జరుపుకుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని బిచ్కుంద పోలీసులు బిచ్కుంద మండలంలో వాజిద్‌నగర్, హజ్గుల్, జుక్కల్‌లో పెద్దగుల్లా, హంగర్గా, మద్నూర్, కొడిచిర, పెద్దకొడప్‌గల్ గ్రామాలను గుర్తించి నిఘా పెట్టారు. ప్రలోభాలకు సైతం అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. గతంలో శాసనసభ, పార్లమెంటు, స్ధానిక ఎన్నికల్లో జరిగిన ఘటనలు, రాజకీయ ఘర్షణలపై పోలీస్ అధికారులు అధ్యయనం చేసి ఆయా గ్రామాల్లో 98 మంది అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా వారిని బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి. ఓ టు హక్కు అందరు సద్వినియోగం చేసుకోవాలి. ని బంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేస్తున్నాం.
– రవి కుమార్, సీఐ, బిచ్కుంద


