వేల్పూర్‌లో భారీ చోరీ
● 8 తులాల బంగారం అపహరణ
వేల్పూర్: మండల కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన మంగలి సుదర్శన్, పక్కనే ఉండే మరో రెండు కుటుంబాల వారు అంక్సాపూర్ జాతరకు సోమవారం ఉదయం వెళ్లారు. దుండగులు సుదర్శన్ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. తెలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు సుదర్శన్‌కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బీరువాలో ఉన్న 8 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. మోతె వైపు వెళ్లే ఆర్‌అండ్‌బీ ప్రధానరోడ్డుకు సమీపంలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంపై గ్రామస్తులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆలయంలో..
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో దుండగులు సోమవారం చోరీకి పాల్పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దుండగులు ఆలయంలోకి చోరబడి హుండీని ఎత్తుకెళ్లారు. అనంతరం సర్వసమాజ్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయాల ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.


