వారం రోజుల్లో 150 కేసులు నమోదు
నిజామాబాద్‌అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల నుంచి చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 150 కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ డివిజన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 150 కేసులు నమోదు కాగా రూ.13లక్షల32వేలు జరిమానా, 21 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు.
● నలుగురికి రూ. పదివేల చొప్పున జరిమానా
బాల్కొండ/ ఆర్మూర్ టౌన్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జడ్జి గట్టు గంగాధర్ ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు ముప్కాల్ ఎస్సై కిరణ్‌పాల్ తెలిపారు. ముప్కాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి పట్టుబడ్డాడు. సోమవారం ఆర్మూర్ కోర్టులో హాజరు పర్చగా జడ్జి అతనికి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ కేసులో నలుగురికి రూ. పదివేల చొప్పున జడ్జి గంగాధర్ జరిమానా విధించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నలుగురు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి వారికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించారు.
మాక్లూర్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ మండలం చిన్నాపూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగూబాయి(59) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


