పరిహారం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం
● విద్యుత్ టవర్ ఎక్కిన బాధితుడు
రుద్రూర్: తమ కుటుంబానికి రావాల్సిన నష్ట పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఓ వ్యక్తి మనస్తాపంతో హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇందూరు సాయిలు కుమారుడు మహేశ్(22), అతని నెల రోజుల కుమార్తె గౌతమి రెండు నెలల క్రితం మండలకేంద్రంలోని ఓ రైస్‌మిల్లు గోడ కూలి మృతి చెందారు. ఈ ఘటనపై సాయిలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పేదరికం కుటుంబం కావడంతో ఘటనకు బాధ్యులైన వారి నుంచి నష్టపరిహారం చెల్లించేలా న్యాయం చేస్తామని గ్రామపెద్దలు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. నాటి నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదు. దీంతో ఆవేదనకు గురైన సాయిలు సోమవారం స్థానికంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఘటన స్థలానికి చేరుకుని బాధితునితో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. తనవంతు సహకారం అందిస్తానని ఎస్సై సముదాయింపుతో కిందకు దిగి వచ్చిన సాయిలుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


