ఊపందుకున్న పంచాయతీ ప్రచారం..!
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల జోరు ఊపందుకుంది. ప్రకటన రావడం, మొదటి.. రెండో.. మూడో విడత నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. మొదటి, రెండో విడతల అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించారు. మూడో విడత నామినేషన్‌ల పరిశీలన అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంది. ఈ నెల 11, 14, 17 తేదీలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై గ్రామాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
● పెద్ద మనుషులతో మంతనాలు..
గ్రామాల్లో కాస్తో కూస్తో పలుకుబడి కలిగిన నాయకులు, పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వారు, విశ్రాంత ఉద్యోగులు, యువకులు తదితరులతో అభ్యర్థులు తమకు మద్దతు ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. గ్రామాల్లో కుల సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలతో ఎవరికి వారుగా లాబీయింగ్ నడుపుతున్నారు. తను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతామని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకొంటూ ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు సైతం ఎవరికివారు ఓటర్లను మెప్పించే పనిలో నిమగ్నమయ్యారు.
●రహస్యంగా విందులు..
అభ్యర్థులు గ్రామాల్లో రహస్యంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం మొత్తం బలాబలాలపై సమీక్షించుకుంటున్నారు. సాయంత్రం కాగానే మందు పార్టీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంటున్నారు. అభ్యర్థులు ప్రత్యర్థి గ్రూపుల్లో కోవర్టులను సైతం పెట్టుకుని ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.
●వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టులు..
ప్రతి గ్రామంలో 5 నుంచి 10 వాట్సాప్ గ్రూపులున్నాయి. ఆయా గ్రూపుల్లో 60 శాతానికి పైగా ఓటర్లు ఉంటున్నారు. అభ్యర్థులు తమను ఎందుకు గెలిపించాలి...తాము గెలిస్తే ఎలాంటి పనులు చేపడతాం. గ్రామాభివృద్ధిపై వారి అభిప్రాయాలను నేతల సందేశాలు, హామీలు , రోజువారీ ప్రచారచిత్రాలను పోస్టు చేస్తున్నారు. ప్రత్యర్థులు పెట్టే పోస్టులకు సమాధానాలు పెడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు వీటినే ప్రసార అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. కొన్ని చోట్ల మహిళా వాట్సప్ గ్రూపుల ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రచార జోరు పెంచారు. నిరక్ష్యరాస్యులైన అభ్యర్థులు సైతం వాయిస్ మెసేజ్‌లు ద్వారా ప్రచారం కొనసాగిస్తుండడం గమనర్హం.
తెల్లవారంగానే ఓటర్లను
ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు
ఎవరికివారే జోరుగా ప్రచారం
అవకాశాలన్నింటిని
వినియోగించుకుంటున్న అభ్యర్థులు
ఊపందుకున్న పంచాయతీ ప్రచారం..!


