వలస ఓటర్లపై స్పెషల్ ఫోకస్
● రానూపోను ఖర్చులు అభ్యర్థులవే
● హామీ తీసుకుని ముందుగానే ఫోన్‌ఫే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు
● మందు, విందు ఏర్పాట్లు
రామారెడ్డి: అన్న నమస్తే.. అంతా మంచిదేనా ఎట్లా ఉన్నావ్.. సర్పంచ్‌గా పోటీ చేస్తున్నా. ఈ నెల 11న మన పోలింగ్ ఉంది. వదిన నీ పెద్ద కొడుకు నువ్వు బుధవారం సాయంత్రంలోగా ఊరికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి.. ఏం ఫికర్ పడకు రానూపోను చార్జీలతోపాటు పైఖర్చులు కూడా చూసుకుంటా. నీ నంబరుకు ఫోన్ పే ఉంది కదా? రవాణా చార్జీలు పంపుతా.. లేదా.. మన ఊరోళ్లు మీ కాలనీలో ఎవరైనా ఉంటే ఓ కారు మాట్లాడుకొని అందరూ రండి.. కిరాయి నేనేస్త. నామీద ఒట్టే.. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఓటెయ్యాలి. హామీ ఇచ్చిన విధంగా ముందే రామారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి పెద్ద హాల్‌ను కూడా మాట్లాడి పెట్టినట్లుగా సమాచారం ఇందులోనే మందు విందుతో పాటు తెలిసన వాళ్ల ఇంట్లో రాత్రి నిద్రకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న కష్టాలివి.
సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే..
స్వల్ప తేడా ఓట్లతోనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల వారీగా అనుకూల ఓట్లపై ఆరా తీస్తూ వారిని ఎలా కలవాలి? అనే దానిపై ప్లాన్ చేస్తున్నారు.
ఉపాధి కోసం వెళ్లినవారిపై ఫోకస్..
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామ ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారని ఇప్పటికే ఆరా తీశారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 200 మంది వరకు వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దింపారు. వలస వెళ్లిన వారికి ఫోన్లపై ఫోన్లు చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంబర్లు సేకరిస్తూ వాట్సప్ గ్రూప్‌లు క్రియేట్ చేసి వారితో నిత్యం అభ్యర్థికి సంబందించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు.
ముందస్తు చెల్లింపులు కూడా...
ముందుగానే డబ్బులు పంపిస్తే ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని, లేకపోతే వేయకపోవచ్చని భావించి కొందరు అభ్యర్థులు ముందుగానే డబ్బులు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేస్తున్నారు.
ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో ఓటరుకు రాకపోకలకయ్యే ఖర్చుతోపాటు అదనంగా ఓటుకు గ్రామ పంచాయతీని బట్టి రూ.500 వరకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లిన వారు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఓటు చేసేందుకు వచ్చినవారు తమకు వచ్చే కూలి డబ్బులు నష్టపోకుండా చెల్లింపులు చేస్తున్నారు.
’గుర్తు’ను గుర్తించుకోవడం కోసం.....
పల్లె ప్రచారం జోరుగా సాగుతోంది. కొంత మంది సర్పంచ్ అభ్యర్థులు గుర్తును జనంలో తీసుకెళ్లేందుకు ఓటర్లకు వారికి కేటాయించిన ఉంగరం, కత్తెర, కప్పు సాసర్లు, బ్యాట్లు, కార్లు, జగ్గులు ఓటర్లకు పంపిణీ చేసి పడరాని పాట్లు పడుతున్నారు.
సమస్యగా మారిన కుల సంఘాలు...
అభ్యర్థులు గెలుపు కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కానీ కుల సంఘాల దగ్గర వచ్చే సరికి ఇబ్బందులు పడుతున్నారు. కులం సభ్యులు పెద్ద మొత్తంలో డబ్బులను అడుగుతుండడంతో అంత డబ్బులు ఇవ్వలేక, ఇవ్వనని చెప్పలేకపోతున్నారు.


