ప్రణాళిక ఖరారు!
యాసంగి
ప్రధాన పంటల సాగు అంచనా వివరాలు(ఎకరాలలో)..
వరి
2,46,500
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు ఇప్పటికీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలన్నీ నిండి ఉండడంతో వాటి కింద ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందనుంది. అలాగే బావులు, బోర్లలో నీరు పుష్కలంగా వస్తుండడంతో వాటి ద్వారానూ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో మొత్తం 4,04,595 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2,46,500 ఎకరాల్లో వరి సాగు అవుతుందని భావిస్తున్నారు. జొన్న, శనగ, మక్క పంటల సాగు విస్తీర్ణం సైతం గణనీయంగానే ఉంటుందని అంచనా వేశారు. జిల్లాలో 78 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 11,400 క్వింటాళ్ల శనగ, 3,750 క్వింటాళ్ల జొన్న విత్తనాలు, 3,400 క్వింటాళ్ల మక్క విత్తనాలు అవసరం ఉంటాయని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. అలాగే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, డీఏపీ ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 12 వేల మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 8 వేల మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 5 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.
సాగునీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఈసారి అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వాగులు ఇప్పటికీ పారుతుండడం, ప్రాజెక్టులు, చెరువులు నిండుగా ఉండడం, బోర్లలోనూ పుష్కలంగా నీటి ఊటలు ఉండడంతో వరి సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో శనగ విత్తనం వేశారు. కొన్నిచోట్ల ఇప్పటికే శనగ మొలకెత్తింది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తనం వేస్తున్నారు. యాసంగిలో వరి సాగు చేయడానికి నారుమడులు పోయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు.
పుష్కలంగా సాగునీరు..
జిల్లాలో దాదాపు రెండునెలలకుపైగా కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి రోజుల తరబడిగా పొంగి పొర్లాయి. ఇప్పటికీ ప్రాజెక్టులకు వరద వస్తూనే ఉంది. వాగులైతే నెలన్నరగా ప్రవహిస్తూ జీవనదులను తలపిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పోస్తూనే ఉన్నాయి. జలవనరులన్నీ నిండుకుండల్లా ఉండడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పైకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పైకి రావడంతో బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరుంది. గతంలో ఎత్తిపోయిన బోర్లలోనూ నీటి ఊటలు వచ్చాయి. దీంతో యాసంగి పంటలకు సాగునీటికి ఢోకా ఉండదన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
యాసంగి సాగు ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. ఈసారి పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉండడంతో 4 లక్షలకుపైగా ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో సగానికిపైగా విస్తీర్ణంలో వరి నాట్లు పడతాయని భావిస్తున్నారు. ప్రణాళికకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నారు.
4.04 లక్షల ఎకరాల్లో పంటల
సాగు అంచనా
2.46 లక్షల ఎకరాల్లో వరి నాట్లు
పడే అవకాశం
విత్తనాలు, ఎరువులు సిద్ధం
చేస్తున్న వ్యవసాయశాఖ


