తెయూలో అక్రమ నియామకాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

తెయూలో అక్రమ నియామకాలకు చెక్‌

Nov 7 2025 8:11 AM | Updated on Nov 7 2025 8:11 AM

తెయూలో అక్రమ నియామకాలకు చెక్‌

తెయూలో అక్రమ నియామకాలకు చెక్‌

రోస్టర్‌ను తుంగలో తొక్కి చేపట్టిన నియామకాలు రద్దుచేసిన హైకోర్టు

తెరవెనుక వ్యవహారాలపై అక్షర యుద్ధం చేసిన ‘సాక్షి’

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రోస్టర్‌ విధానాన్ని తుంగలో తొక్కి తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన అధ్యాపకుల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రోస్ట ర్‌ నియామకాలను పట్టించుకోకుండా 2012లో నోటిఫికేషన్‌ ఇచ్చి 2014లో అక్రమ మార్గంలో చేపట్టిన నియామకాలు ఈ తీర్పుతో రద్దయ్యాయి. అప్పట్లో 91 పోస్టుల భర్తీకోసం ఈ నోటిఫికేషన్‌ ఇచ్చి 53 మందిని రిక్రూట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం 45 మంది పనిచేస్తుండగా మిగతా 8 మందిలో కొందరు రిటైర్‌ కాగా, కొందరు మరణించారు.

చేర్చకూడనివి చేర్చి.. చేర్చాల్సినవి వదిలేసి..

2012లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో చేర్చకూడని పోస్టులు చేర్చడం, చేర్చాల్సిన పోస్టులు వదిలేయడంతో సంబంధిత సబ్జెక్టుల రోస్టర్‌ పాయింట్లు మారిపోయాయి. దీనిపై అకడమిక్‌ కన్సల్టెంట్ల అసోసియేషన్‌ 2013 ఫిబ్రవరి 22న కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తాజా తీర్పు వెలువరించిన హైకోర్టు కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చుకోవచ్చని సూచించింది. జీవో 420 ప్రకారం వర్సిటీలో ఆర్ట్స్‌, సైన్స్‌ గ్రూపులను వేరుగా తీసుకుని, ప్రతి గ్రూప్‌లోని సబ్జెక్టులను అక్షరానుక్రమంలో పెట్టి, అన్ని పోస్టులకూ ఒకే రన్నింగ్‌ రోస్టర్‌ వర్తింపజేయాల్సి ఉంది. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు వేర్వేరు రోస్టర్‌ నిర్వహించడం అసాధ్యం కావడంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు నిలిపివేసి, వాటి స్థానంలో రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఎంఏ ఎకానమిక్స్‌, ఎమ్మెస్సీ ఫార్మాసూటికల్‌ కెమిస్ట్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని 20వ పాలకమండలి 2012 ఏప్రిల్‌ 27న నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు యూనివర్సిటీ రెగ్యులర్‌ స్టాఫ్‌ను తీసుకోలేదు. ఎక్కువగా తాత్కాలిక కన్సల్టెంట్లతో క్లాసులు నిర్వహించింది. మార్పుల తర్వాత పోస్టుల లెక్కలు, రోస్టర్‌ పాయింట్లు మళ్లీ పరిగణనలోకి తీసుకుని పాలకమండలిలో పెట్టాల్సి ఉన్నప్పటికీ దీన్ని పాటించలేదు.

పాలకమండలి తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ..

వర్సిటీలో అక్రమాలపై గతంలో పాలకమండలి అలుపెరగని పోరాటం చేసింది. గత వీసీ రవీందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ల అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు తీర్మానం చేసింది. విచారణ నడుస్తోంది. వాకాటి కరుణ ఇన్‌చార్జి వీసీగా ఉన్నప్పుడు పాలకమండలి సభ్యులు తిరస్కరించినప్పటికీ ప్రమోషన్ల అంశంపై లీగల్‌ ఒపీనియన్‌కు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వాకాటి కరుణ ప్రమోషన్ల వ్యవహారాన్ని అప్పటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌తో కలిసి తిరస్కరించారు.

ఒకరికి ఒకలా.. మిగిలిన వారికి మరోలా..

యూజీసీ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ప్రొఫెసర్‌ తనకు తానే ఉద్యోగోన్నతి పొందినట్లు రిజిస్ట్రార్‌ యాదగిరి ప్రభుత్వానికి తెలిపారు. దీనిపై లోక్‌ అదాలత్‌లో అప్పీల్‌ చేశారు. మరో నలుగురి విషయంలో మాత్రం అప్పీల్‌కు వెళ్లకుండా ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement