పత్తి తీతలో మెలకువలు పాటించాలి
● తేమ శాతం 12 లోపు
ఉండేలా చూసుకోవాలి
● మండల వ్యవసాయ అధికారి రాజు సూచనలు
మద్నూర్‌లోని జిన్నింగ్ మిల్లుకు తరలించిన పత్తి
మద్నూర్: జిల్లాలో పత్తి పంట చేతికొస్తోంది. దీంతో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లనూ ప్రారంభించారు. అయితే కొనుగోలు
కేంద్రాలలో తేమ 12 శాతంలోపు ఉంటేనే కొనుగో లు చేస్తారు. నాణ్యమైన పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. ఈ నేపథ్యంలో పత్తి తీయడంలో పాటించాల్సిన మెలకువలను మండల వ్యవసాయ అధికారి రాజు వివరించారు. ఆయన సూచనలిలా ఉన్నాయి.
వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎండ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయవద్దు. ఆ సమ యంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలిసే అవకాశాలు ఉంటాయి. పొద్దున, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే తీయాలి.
పంట కాలంలో కనీసం మూడుసార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళి, ఎరువులు, పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరు చేయాలి. దీన్ని మంచి పత్తిలో కలపకూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది.
సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది.
నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది. పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి. పూర్తిగా ఆరిన తర్వాతే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
తడిసిన పత్తిని ఏం చేయాలి?
వర్షానికి తడిసిన, మంచు బిందువులతో చ ల్లబడిన పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి.
గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత తీయాలి.
ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు, నీరు లేని సమయంలో తీయాలి.
ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి.
ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి.
తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరె(సంచు) ల్లో నింపాలి.
కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు.
తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకేలా ఉంచాలి. లేకపోతే ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.
పత్తి తీతలో మెలకువలు పాటించాలి


