కామారెడ్డి క్రైం: బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామూహిక వందేమాతర గానం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలలో సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించాలని అదనపు కలెక్టర్ విక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు వందేమాతరం పాడాలని సూచించారు. దేశభక్తి భావాన్ని బలపరచడం, జాతీయ గీతాన్ని గౌరవించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
‘ప్రతి గింజనూ
కొనుగోలు చేస్తాం’
నాగిరెడ్డిపేట: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని డీఆర్‌డీవో సురేందర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాల్తుమ్మెదలోని ప్రభుత్వ భూమిని తహసీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాల్తుమ్మెద శివారులోని ఎకరం భూమిలో మండల సమాఖ్య ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మండల సమాఖ్య నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చిస్తామన్నారు. జిల్లాలో గ్రామసంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 3,393 మంది రైతుల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. 1,763 మంది రైతులకు రూ. 23.52 కోట్లు చెల్లించామన్నారు. అనంతరం కన్నారెడ్డి గేట్ వద్ద గ్రామ సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన బోర్డును పరిశీలించారు. ఆయన వెంట డీపీఎం సురేష్, సీసీలు నారాయణ, రమేష్, దత్తు, అకౌంటెంట్ రాజు తదితరులున్నారు.
విద్యార్థులకు పాఠం చెప్పిన ట్రైనీ కలెక్టర్
రామారెడ్డి: ట్రైనీ కలెక్టర్ రవితేజ టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠం చెప్పారు. గురువారం ఆయన రామారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు పాఠం చెప్పారు. విద్యాబోధన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు లింగపురం బాలరాజ్, మురళి గౌడ్ తదితరులున్నారు.
మైనారిటీ కళాశాల తనిఖీ
కామారెడ్డి అర్బన్: దేవునిపల్లి వాసవి కాలనీ లోని మైనారిటీ బాలుర జూనియర్ కళాశాల ను ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారి ఒడ్డెన్న గురువారం తనిఖీ చేశారు. తాగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు, వసతిగృహం, మౌలి క సదుపాయాలను పరిశీలించారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, ప్రవేశాలు, డాక్యుమెంటేషన్‌ను ప్రత్యేకాధికారి వెంట వచ్చిన బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ, అధ్యాపకులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రం వద్ద ఆంక్షలు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని డిపార్ట్‌మెంటల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్ష కేంద్రం వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నందున నగరంలోని ఏవీ ఎంటర్ ప్రైజెస్ అర్సపల్లి బైపాస్ సెంటర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని, నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రం పరిసరాల్లో తిరగొద్దని సూచించారు. జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని, లౌడ్ స్పీకర్లను వినియోగించొద్దని పేర్కొన్నారు.
‘నేడు సామూహిక వందేమాతర గానం’
‘నేడు సామూహిక వందేమాతర గానం’


