పొంచి ఉన్న ప్రమాదం
జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తా
అధికారులకు ఫిర్యాదు చేశాం
బిచ్కుంద(జుక్కల్): వర్షం పడితే ఎత్తయిన గుట్టపై నుంచి మట్టి కరిగి పెద్ద, చిన్న బండరాళ్లు, మట్టి దిబ్బలు పాఠశాల ఆవరణలోకి దూసుకొస్తున్నాయి. బిచ్కుంద దత్తనగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గుట్టకు ఆనుకొని అప్పట్లో అధికారులు నిర్మించారు. దౌల్తాపూర్ రోడ్డులో బిచ్కుంద పట్టణానికి ఆనుకొని 200 అడుగుల ఎత్తు, కిలోమీటరు పొడవున పెద్ద ఎత్తయిన గుట్ట ఉంది. దానికి ఆనుకొని ప్రభుత్వ భూమిలో రెండు, మూడు గుంటల విస్తీర్ణంలో పాఠశాల ఉంది. 23 మంది విద్యార్ధులు పాఠశాలలో ఉన్నారు అందులోనే భవిత సెంటర్ కొనసాగుతోంది. అంగవైకల్యంతో ఉన్న పిల్లలకు వారంలో రెండు సార్లు ఫిజియోథెరపి చేయిస్తారు. పెద్ద వర్షం పడితే ఎత్తయిన గుట్టపై నుంచి నీరు, మట్టి, బండరాళ్లు పాఠశాల ఆవరణలోకి వస్తుండటంతో పెద్ద ప్రమాదం జరిగే పరిస్ధితి ఏర్పడింది. ఆవరణలో విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు. గుట్ట పై నుంచి వస్తున్న నీరు ఆవరణలో ఐదారు అడుగుల వరకు ఆగి ఉంటున్నాయి. సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయులు రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆవరణలో నుంచి నీరు బయటకు వెళ్లే పరిస్దితి లేదు. బయటకు వెళ్లేవిధంగా మురికి కాలువ, కల్వర్టు నిర్మించాలి. గుట్ట పై నుంచి మట్టి, రాళ్లు, నీరు రాకుండా చుట్టూ ప్రహరీ నిర్మించాలని గతంలో ఎన్నోసార్లు జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులకు వేడుకున్నా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని దత్తనగర కాలనీ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.
దత్తనగర్ పాఠశాలకు ప్రమాదం పొంచి ఉన్నది వాస్తవమే. సమస్య పరిష్కరించాలని గతంలో కోరాం. పాఠశాల చుట్టూ ప్రహరీ, నీరు బయటకు వెళ్లే విధంగా కల్వర్టు నిర్మించాలి. జిల్లా విద్యాధికారి దృష్టికి సమస్యను తీసుకెళ్తాను. పరిష్కారానికి నావంతు కృషి చేస్తాను.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈవో, బిచ్కుంద
ఎత్తయిన గుట్టకు ఆనుకొని పాఠశాల ఉంది. ప్రమా దం పొంచి ఉంది.. సమస్య పరిష్కరించాలని గతంలో బిచ్కుంద ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆవరణలో నుంచి నీరు బయట కు వెళ్లడానికి మురికి కాలువ లేదు. నీరు ఆగి ఉంటున్నాయి. పిల్లలు ఆడుకుంటూ గుంతలో పడే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. –గంగారాం, హెచ్‌ఎం, దత్తనగర్ స్కూల్
గుట్టకు ఆనుకొని ఉన్న బిచ్కుంద దత్తనగర్ స్కూల్
పై నుంచి పాఠశాలలోకి
వస్తున్న బండరాళ్లు
వర్షం కారణంగా మట్టి కరిగి
జారి పడుతున్న రాళ్లు
భయాందోళనలో విద్యార్థులు,
ఉపాధ్యాయులు
పొంచి ఉన్న ప్రమాదం


