గల్లీల్లో తక్కువ కిరాయి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో అద్దెలు దరువేస్తున్నాయి. ఏడాదికేడాది పెరిగిపోతున్న కిరాయిలు దుకాణదారులకు భారంగా మారుతున్నాయి. వ్యాపార సముదాయ భవనాల, మడిగెల యజమానులు ఒకరిని మించి ఒకరు అద్దెలను భారీగా పెంచుతున్నారు. దీనికి తోడు కార్పొరేట్ సంస్థలు మాల్స్‌ను, బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో దందాలకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. మడిగెలు కిరాయికి తీసుకుని వ్యాపారాలు, వృత్తులు నిర్వహిస్తున్న వారు పెరిగిన అద్దెలు భరించలేక, పోటీని తట్టుకోలేక దందా మానుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంపాదన తగ్గి, ఖర్చులు పెరగడంతో ఎలా బతికేదని చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో కష్టమో, నష్టమో భరిస్తున్నారు. మరికొందరు ప్రధాన రోడ్లపై ఉన్న దుకాణాలను గల్లీల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అక్కడ తక్కువ కిరాయిలు ఉంటాయనే ఉద్దేశంతో దందాలు గల్లీబాట పడుతున్నాయి. జిల్లా కేంద్రంలో గతంలో స్టేషన్ రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, సుభాష్‌రోడ్డు, గంజ్ రోడ్డు, తిలక్‌రోడ్డు, పెద్ద బజార్ తదితర ప్రాంతాల్లోనే ఉండేవి. ప్రస్తుతం రైల్వేలైన్ పైభాగాన పాత జాతీయ రహదారిపై నిజాంసాగర్ చౌరస్తానుంచి మున్సిపల్ కార్యాలయం మీదుగా కొత్త బస్టాండ్, చర్చీ చౌరస్తా నుంచి టీవీ టవర్ వరకు దందాలు విస్తరించాయి. అలాగే నిజాంసాగర్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డు వరకు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి గ్రామం వరకు, మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంతం నుంచి సాయిబాబా టెంపుల్ రోడ్డు, బస్టాండ్ నుంచి ఆర్‌కే లాడ్జి రోడ్డు... ఇలా వివిధ ప్రాంతాలకు వ్యాపారాలు విస్తరించాయి.
చిన్న మడిగెలు కూడా రూ.20 వేల పైనే..
పట్టణంలో ప్రధాన రోడ్లపై చిన్న చిన్న మడిగెలకు సైతం కిరాయిలు(అద్దె) రూ.20వేల పైనే వసూలు చేస్తున్నారు. గతంలో రూ.10 వేలు ఉన్న మడిగెలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. పెద్దహాల్ ఉండి హోటళ్లు, ఇతర వ్యాపారాలకు అనుకూలంగా ఉంటే అద్దె రూ. 30వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటోంది. కిరాయలు ఎంతైనా దందా నడిస్తే నెట్టుకొచ్చేవారు. అయితే వివిధ వ్యాపారాలకు సంబంధించి కార్పొరేట్ సంస్థలు బ్రాంచీలు తెరుస్తుండడం స్థానికంగా వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో కిరాణ వ్యాపారం జోరుగా సాగిన కామారెడ్డి పట్టణంలో ఇప్పుడు సూపర్ మార్కెట్‌లు, కార్పొరేట్ సంస్థల మార్ట్‌లు, మాల్స్ అంటూ ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. దీంతో చిన్నచిన్న కిరాణ దుకాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందరూ సూపర్ మార్కెట్‌లవైపు అడుగులు వేస్తున్నారు. మాల్స్ మూలంగా స్థానికంగా కొన్ని సూపర్ మార్కెట్‌లు కూడా దెబ్బతింటున్నాయి. అలాగే పట్టణంలో వందలాది బట్టల దుకాణాలు నడిచేవి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తోపాటు వివిధ కంపెనీలకు సంబంధించిన అవుట్‌లెట్‌లు, బ్రాంచీలు తెరిచారు. దీంతో చాలా దుకాణాల్లో వ్యాపారం దెబ్బతింటోంది.
ప్రధాన రోడ్లపై కిరాయి ఎక్కువగా ఉండడంతో చాలా మంది గల్లీల్లోకి మారుతున్నారు. అక్కడ కిరాయి తక్కువగా ఉంటున్నాయి. మెయిన్ రోడ్లపై ఉన్న అద్దెలో సగానికన్నా తక్కువగా ఉండడంతో ఎంత తగ్గితే అంత లాభం అనే పరిస్థితుల్లో గల్లీబాట పడుతున్నారు. చిన్న చిన్న హోటళ్లు, కిరాణ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు, చెప్పుల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, చాయ్ హోటళ్లు... ఇలా చిరు వ్యాపారులు ప్రధాన రోడ్లకు దండం పెడుతున్నారు. ఆ అద్దెలు భరించలేమంటూ కొందరైతే వ్యాపారం మానేస్తున్నారు. దీంతో ప్రధాన రోడ్లపై చాలా మడిగెలు, భవనాలలకు టులెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎన్‌హెచ్–7 (పాత జాతీయ రహధారి), నిజాంసాగర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కిరాయలు పెరిగిపోవడంతో కొందరు దందాలను మార్చేశారు. మరికొంందరు అదే బాటలో ఉన్నారు.
గల్లీల్లో తక్కువ కిరాయి


